గొర్రె వాగ్దానం

ఫిబ్రవరి 15, 2009 at 5:49 అపరాహ్నం (కవిత్వం) (, , , , , )

ప్రియమైన మా కటికన్న
నన్ను ప్రేమతో ముద్దాడి, కాలి గెట్టెలో విరిగిన ముళ్ళను
మునిపంటితో కొరికేసి, తల్లి కాపరికి వీడ్కోలు చెప్పి
నన్ను బుజానేసుకుని ఇంటికి చేరుస్తాడు.

కటికన్న ఇంటి నిండ పిల్లలే, గీ పిల్లల కడుపు నిండాలంటే
రేపు నేను కబేళాలో మంచి కుప్పపడాలే, మంచి తునుక కావాలే

ఇదిరా బుద్ది సంబందం… … …
మెతుకు సంబందం… బతుకు సంబందం… పరువు సంబందం… ప్రకృతి సంబందం.

వృత్తి కులాలను అవమానించి అనచివేస్తున్న
మీ పెన్నులపైన, మీ బుద్దులపైన, మీబుక్కులపైన
గొర్రెల మందంత ఉమ్మడిగ ఉచ్చపోస్తున్నం
పంచభూతాల చుట్టు ఫెన్సింగ్ చేసిన చట్టాలను
పిలకలతో ఉత్పత్తి కులాలను ఉరి తీస్తున్న భావజాలాన్ని
భూమిని పాడెకెక్కించిన రాజ్యాన్ని
ఏమీ పేకలేని మీ అనాకారితనాన్ని నిరసిస్తు…
సెంథిల్ కుమార్, బల్ రాజ్ ల చివరి శ్వాసతో మీకో వాగ్దానం.
తోడేళ్ళను వేటాడటానికి గుంపు కట్టాలె
గుంపును నడిపించటానికి గుదుప పట్టాలె
భూమిని చంపిన రాజ్యాన్ని, పరువును చంపిన జంధ్యాన్ని
ఉన్నితో ఉరి తీయాలె… గత్తిలో అస్తికలు కలపాలె.

వ్యాఖ్య ను ఉంచండి